ముప్పైలలో...
అందరిలాగే సెలవులుంటే నా లోని ఖాళీని నింపాలనే ప్రయత్నం తో 
వేల్స్  లోని,  సముద్రానికి  దగ్గరగా  ఉండే  పోర్టుమెరిన్ కి వెళ్ళాం
అది కల లాంటి ఒక గ్రామం అట, ప్రతి ఇల్లు రంగు రంగుల ఒక వింత కట్టడం అట
ఆ ఊరి సముద్రచీలిక ఒడ్డున, ఎగిరే పక్షులని చూస్తూ నించుంటే 
గుప్పుమంటూ ఒక మెరుపు దాడి
        తలతిప్పి  చూస్తే అచ్చంగా కత్తులు పట్టిన సైన్యంలా ఒక గులాబీల తోట 
        ఎన్నోసార్లు  గులాబీ అందం చూసాను
        కానీ,  ఆరోజు  ఆ సుగంధంలో గులాబీలోని  అసలు వింతని చూసాను

ఇరవైలలో...
ఫ్రెండ్  ఇంటి  డాబా  మీద  సాయంత్రం  విరజాజి  మొగ్గలు  కోసి,
వాళ్ళ  అమ్మకి  సాయం  చేసాననుకున్నాను  
వాళ్ళ  ఇంట్లో  నేను  గడిపిన  ఆనందమైన  సమయాన్ని  గిఫ్ట్  వ్రాప్  చేసినట్టు 
మొగ్గలన్ని మాల  కట్టి  నాకిచ్చేది  ఆ  మహాతల్లి!


        రాత్రి  వేళ  ఒంటరి  గా ఇంటికి  తిరిగి  వెళ్తుంటే 
        మొగ్గలు  మేలుకుని  దారి  పొడుగునా తోడు  వచ్చేవి
        ఆ  జ్ఞాపకాలన్నిటికి  కాపలా ఆ  పూల  ఘుమఘుమలే ! 

ప్లస్  టూ   లో ...
విశాఖ  లో  ఉన్నప్పుడు  సింహాచలం  వెళ్లే  దారిలో  సన్నని  చినుకు
తడిసిన  సంపెంగలు  నేలమీద  కొన్నీ, చెట్టు  మీద  కొన్నీ 
ఏరుకున్న  పూల  వాసనా  ఎంత  దూరం  వచ్చిందంటే, 

        కొన్ని   ఏళ్ళ   తరువాత..
        ఎప్పుడో చలం తన రచనల్లో సంపెంగని గురించి రాసుకున్నది చదివినప్పుడు,
        కనీసం, దాని వాసన విలువ తెలుసని తృప్తి పొందేంత, 
        చలం పొందిన అనుభూతిని ఊహించగలనని మురిసి పోయేంత,         

ఏడవ  క్లాస్  లో  .....
పొద్దున్నే బస్టాప్ నడిచి  వెళ్లే  దారిలో 
ఇంటి దగ్గర మలుపులో,​ ​
నేను ​​
అప్రయత్నంగా  ఆగిపోయాను ,
పదేళ్ల నా చిన్న జీవితం లో అలాంటి ఒక ఫీలింగ్ ఉంటుందని తెలియదు ,

        తన  పరిమళం  మరిచిపోలేని  గొప్ప  పరిచయం
        అదే  మా  వీధి  చివరింట్లో  రాలిన  పారిజాతం .
        పూవు  గుర్తుంది , చోటు  గుర్తుంది , ఆ  ఫీలింగ్ గుర్తుంది
        అన్నీ  జ్ఞాపకాలే , మరి  ఏవి  పరిమళాలు?

---  'మెట్టా'