నాలుగు రోడ్ల కూడ‌లి.
"నేను ఏ దారిన వెళ్ళాలి?" అడిగాడు కుర్రాడు.
"ఎక్క‌డ‌కి వెళ్ళాలి?" దిక్కులు చూస్తున్న పిల్లాడ్ని అడిగాడు పెద్దాయ‌న‌.
"అదీ తెలియ‌దు"
"అయితే ఏ దారి  అయినా ఒక‌టే." చెప్పాడు పెద్దాయ‌న‌.
మ‌న దేశంలోని చాలామంది యువ‌తీ యువ‌కుల ప్ర‌తినిధి ఆ కుర్రాడు.
ఎందుకు చ‌దివారో తెలియ‌దు, చ‌దివి ఏం చేయాల‌నుకుంటున్నారో తెలియ‌దు. ర్యాంకుల కోసం పోరాటం, మార్కుల కోసం ఆరాటం, ఉద్యోగం కోసం కిందామీదా ప‌డ‌టం. ఉద్యోగం వ‌స్తే, సెటిల్డ్ ఫీలింగ్ తో  జీవితానికి సెక్యూరిటీ వ‌చ్చేసింద‌ని న‌మ్మ‌టం. చాలా భద్రంగా ఏ ఒడిదుడుకులూ లేని, ఏ మార్పులూ లేని జీవితాన్ని ఒకేలా గ‌డిపేయ‌టం....ఇది ఎంద‌రో చేసే ప‌ని! క‌నిపించిన‌ ఏదో ఒక దారిలో త‌లొంచుకు న‌డుచుకుపోవ‌టం.

ల‌క్ష్యం ఏమిటో ముందే నిర్ణ‌యించుకోవ‌టం, ఆ ల‌క్ష్యాన్ని చేరుకొనే దారుల‌ను అన్వేషించ‌టం, ఏ దారీ లేద‌నుకుంటే కొత్త దారులు వేయ‌టం - కొంద‌రే చేయ‌గ‌ల ప‌ని. అలా కొత్త దారుల‌ను అన్వేషిస్తున్న, కొత్త దారుల‌లో ప‌య‌నించాల‌ని క‌ల‌లు కంటున్న‌ న‌వ యువ‌కుల కోసం సురేశ్ రాసిన పుస్త‌కం ఇది. ఒక దార్శ‌నిక‌త‌తో, వ్యూహంతో, ఆశావ‌హ దృక్ప‌థంతో, ల‌క్ష్యాన్ని ఎలా సాధించవ‌చ్చో ఈ పుస్త‌కం వివ‌రిస్తుంది.
ఇంట‌ర్నెట్ అంటేనే గూగుల్ అనుకుంటాం మ‌నం. సైడ్ వికి, పిక్నిక్‌, ఆర్డ్‌వార్క్‌, గూగుల్ నోట్‌బుక్‌, గూగుల్ డిక్ష‌న‌రీ, ల్యాబ్స్‌, ఐ గూగుల్‌, గూగుల్ టాక్‌, గూగుల్ హెల్త్‌, నోల్‌, జైకు, గూగుల్ పేజ్ క్రియేట‌ర్‌, గూగుల్ లైవ్‌లీ, గూగుల్ ఆన్స‌ర్స్ - ఇవ‌న్నీ గూగుల్ ప్రాజెక్టులే. అతి కొద్ది కాలంలోనే మూత‌ప‌డ్డాయి. ఏ విజ‌యంలో అయినా అప‌జ‌యాలుంటాయనేందుకు ఇదే ఒక పెద్ద ఉదాహ‌ర‌ణ‌. క‌నుక జ‌యాప‌జ‌యాల గురించి అంత‌గా ఆందోళ‌న చెంద‌కుండా, మ‌నం ప్ర‌య‌త్నం మీద‌నే దృష్టి పెట్టాలి.
ఆ కాల‌పు న్యూట‌న్, ఎడిస‌న్, పికాసో లు కావ‌చ్చు. ఈ కాల‌పు స్టీవ్‌జాబ్‌, లారీ పేజ్‌, జుక‌ర్ బర్గ్ కావొచ్చు. రాత్రికి రాత్రే గొప్ప‌వాళ్ళ‌యి పోలేదు. నిద్ర లేని రాత్రుల‌తోనే అయ్యారు. రిస్క్ లేని జీవితం గ‌డ‌ప‌లేదు. రిస్క్‌ల‌తోనే జీవితం గ‌డిపారు. ఏ ప్ర‌య‌త్నంలో అయినా గెలుపూ ఓట‌మీ క‌ల‌గ‌లిసే వుంటాయి. మారే ప‌రిస్థితులూ, ఎదురౌతున్న ఫ‌లితాలకు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వ్యూహాల‌తో ముందుకు పోవ‌టమే అస‌లైన విజ‌యం.
స్టార్ట్ అప్ ల పేరిట న‌వ్య‌మైన ఆలోచ‌న‌ల‌తో, ఆవిష్క‌ర‌ణ‌ల‌తో ఆకాశ‌మే హ‌ద్దుగా ఎద‌గాల‌నుకుంటున్న యువ‌త‌కు చేయూత‌నిస్తూ, మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచే స్టార్ట‌ప్ ను ఇలా గెలిపించండి పుస్త‌కంతో మ‌న ముందుకు వ‌స్తున్న సురేశ్‌కి అభినంద‌న‌లు.

వ‌ర్క్ ప్లేస్ మేనేజ్‌మెంట్ పుస్త‌కాల సిరీస్‌లో భాగంగా సురేశ్ వెలుగూరి 'ఆలోచించండి, ప్రారంభించండి, ఎద‌గండి' అని పిలుపునిస్తూ వ్రాసిన పుస్త‌కం - స్టార్ట‌ప్ ను ఇలా గెలిపించండి. 

ప్ర‌చుర‌ణ : విఎంఆర్‌జి ఇంట‌ర్నేష‌న‌ల్‌, ధ‌ర : 300 రూపాయ‌లు
పుస్త‌కం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. 
Buy Book