పాపి గాడి పిల్లి…. 
పారి పోయింది.
“పొద్దుట్నుంచి వెధవ పిల్లి కనపడలేదని అటూ ఇటూ తిరిగినవాళ్ళు తిరిగినట్టు ఉన్నారే గాని, పెద్ద ముండని, నా మొహాన కనీసం ఒక ముద్దైనా అన్నం పడేసారే! కనీసం కాఫీ నీళ్ళైన పొయ్యట్రే!!” అని అరుస్తోంది పాపి గాడి నాయనమ్మ.
పాపిగాడేమో, పిల్లి కనపడలేదని బెంగెట్టుకుని, జ్వరం తెచ్చుకుని, స్కూలు మాని మరీ, ఏడుస్తున్నాడు. స్నానం కూడా చెయ్యకుండా... ఉండలు కట్టిన మట్టి తలతో, నేల మీద పడి దేకుతున్నాడు. మధ్య మధ్యలో  సోకాలు వేరె.
భాస్కర్ మటుకు, తనకేవి పట్టనట్టు పేపర్ చదువుకుంటూ, ఆరోజు  పేపర్ కదా, కనీసం ఇంకెవరైనా చదువుతారెమో, అన్న ఇంగితం కూడా లెకుండా, పేపెర్ మీదే గోళ్ళు కత్రించుకుంటున్నాడు.
ఇవన్నీ జరుగుతూంటే,  పక్క పాకల్లో  ఉన్న అప్పల్రాజుకి, పని మనిషి కనకం ద్వారా, కబురు పెట్టింది వసుంధర. అదే టైంలో చాకలి లింగమ్మ రావటం తో అందరికీ చెప్పింది,“మా పాపిగాడి పిల్లి ఎక్కడైనా కనపడితే పట్టుకు రండర్రా.”
ఆ మాట విని అప్పల్రాజు అన్నాడూ…”అమ్మ గారు! ఏ బండి కింద అయినా పడి చచ్చిపొనాదేమొ”....
“ఛి!! ఊరుకోరా!! వాడు వింటే, నన్ను కాల్చుకు తింటాడు”...
ఇంతలో లింగమ్మ “అమ్మ గారు!” అని సాగదీస్తూ “పిల్లికి తొమ్మిది జనమలు ఉంటాయట!? అమ్మ గారు, నిజమేనా?”
“ఏమో నే బాబు, ఈ పిల్లి పారిపోవటం నా ప్రాణనికి వచ్చింది...వెతికి తెస్తే, మీకు నెల జీతం పెంచుతా.” వసుంధర మాట పూర్తి కానేలేదు, పేపర్ ని చక చక  ఉండచుట్టి, విసిరి కొట్టి, ఉన్నపళంగా రెండే అంగల్లొ, వీధిలోకి వచ్చాడు భాస్కర్.
“వెధవ పిల్లి కోసం మళ్ళీ ఇదొకటా...దాని మొహాన పాలు పోసినా, దాని రుబాబు దానిదే...ఎంత దగ్గర చేసిన...దాని టెక్కు దానిదే... వెధవ టెంపెర్. ఆఫీసు నుంచి రాగనే మనం దాని ఇంట్లో ఉన్నట్టు మొహం తిప్పుకుంటుంది ... అదేదో నేను దానికి బాకి పడ్డట్టు. ఇంతకన్నా కుక్కే నయం, కనీసం ఒక ముద్ద పడేస్తే విశ్వాసంగ పడి ఉంటుంది.
వాడెవడూ.... పాపి గాడి ఫ్రెండు, ఎంచక్కా కుక్కని పెంచుకున్నాడు. వీడికి ఒక కుక్క కొన్నా పోయేది . ఈ పిల్లి ముండ!! అదే వచ్చింది. మూడెల్లు ఉంది గా మరి. ఏం ముంచుకొచ్చిందో, పారి పోయింది. దాని మానాన అదే పోయింది. ఇంక దానిమీద ఒక్క పైసా పెట్టను.”                        
                                     

ఈ మాట ఇలా పూర్తి అయ్యె లోపే, గట్టిగా సోకాలు పెడుతూ, ముక్కు చీమిడి కూడ తుడుచుకొకుండా...వేసుకున్నజుబ్బా చింపుకుని మరీ ఎడుపు మొదలెట్టాడు పాపి.
ఆడ పిల్ల పుడితే ముద్దు గా పాపా అని పిలుచుకుందామని అనుకున్నాడు భాస్కర్. వీడు పుట్టే సరికి, రాజీ పడి ఆ ముద్దు పేరు వీడికే సద్ది పెట్టాడు.“ఆహా! నా నాయనే. ఆడ పిల్ల లేని లోటు తీరుస్తున్నావురా నీ ఎడుపు తో. నీకు మళ్ళీ జుబ్బా కొంటే ఒట్టు! మొండి మొల తోనే ఉండు!! వెధవ!!”
“నాకేమొద్దు ఫొ!” అని అరిచాడు పాపిగాడు.
వసుంధర, తన మాట గా పిల్లి ని వెతకమని పని వాళ్ళకి చెప్పింది.
ఇంక సాయంత్రం అయ్యింది. వసుంధర, భాస్కర్, ఆఫీసు నుంచి తిరిగి వచ్చారు...“అత్తయ్యా, పాపి గాడు ఏమైనా తిన్నాడా?”  అని అడిగింది ఆత్రుత గా... “ఏమోనే తల్లీ, నేను పూజ లో ఉండగా వచ్చింది కనకం...అన్నం పెట్టమన్నాను.” “అయ్యో!! అత్తయ్య …అన్నం పెట్టమంటే కుక్కరు పెట్టింది.”

పాపి గాడి గదిలోకి వెళ్ళింది. వాడు మంచం ఒదిలేసి, నేల మీద చొక్కా లేకుండా నిద్ర పోతున్నడు ...వాడి ఒళ్ళు కాలి పోతోంది. కనీసం 103 ఉంటుంది. ఏలాగో లేపి, నిద్ర లోనే వాడికి చొక్కా వేసి, చారన్నం కలిపి పెట్టింది...బెంగతో వచ్చిన  జ్వరం వల్లేమో, ఆకలిగా పెట్టిందంతా తిన్నాడు. అత్తగారి నిర్లక్ష్యానికి, గొంతులో వచ్చే కోపాన్ని దిగ మింగుకుని...కళ్ళలో వచ్చే ఏడుపు ని ఆపుకుంటూ...వాడి  నుదుటన ముద్దు పెట్టి, వాడికి వెచ్చగ దుప్పటి కప్పి, గదిలోంచి బయటకి వచ్చింది.
చేతికున్న గడియారం, గాజులు తీస్తూనే “భాస్కర్! వాడికి 103 జ్వరం ఉంది. నేను రేపు వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా ...ఆఫీసు కి నువ్వు వెళ్ళు”...
“మంచిది” అన్నాడు భాస్కర్, కనీసం ఒక ప్రశ్న కూడా వెయ్యకుండా. వసుంధర తనకీ జవాబు చాలునో, చాలదో అనే తర్కం కూడా చెయ్యకుండా తిరిగి వెళ్ళిపోయింది.

రాత్రి 3.30 అయ్యింది.
పాపిగాడు కళ్ళు మగతగా తెరిచాడు .... కళ్ళ ముందు కిటికీ లో పిల్లి!! ...కళ్ళు పెద్దవి చేసి గబుక్కున కూర్చున్నాడు ... “అహ్!! వచ్హేశావా??!!” అని అడిగాడు.
వీడికి మతి పోయేలా.... పిల్లి బదులు ఇచ్చింది!! కలో నిజమో అర్ధం కాలేదు "అవును వచ్చాను. కాని వెళ్ళి పోతున్నా అని చెప్పడానికి."

పట్టలేని ఏడుపు వచ్చింది పాపి కి!!! బొట బొట ఏడ్చేశాడు!!
"ఇదిగో, ఇందుకే. ఇలా నువ్వు ఏడుస్తావనే వచ్చాను ...నీ కోసం."
"మరి ఎందుకని, వెళ్తానంటున్నావు. నేనంటే ఇష్టం లేదా??”
“నువ్వు కాదు రా!! నాకు మీ ఇల్లు నచ్చలేదు. నాయనమ్మ, నాన్న, అమ్మా. ఎవ్వరూనూ. ఏవిటో, అందరూ, ఎవరి జీవిత భారమో మోస్తున్నట్టు ఉంటారు. స్పందన లేని, స్వేచ్చ లేని, పిరికి బతుకులు ఈడుస్తున్నారురా, వీళ్ళు.”
“మీ నాయనమ్మ నన్ను అస్తమానం పిల్లి పిండాలు కోరుతుంది అంటుందే! పిల్లి పిండాలు కోరబట్టేనా, 89 వచ్చినా అంత ఆరోగ్యంగా ఉంది ...ఈవిడ ఆరోగ్యానికి  కారణం తన వైరాగ్యం, తన పూజలేనట. వైరాగ్యం అంటే అన్నింటినీ... అక్కరనీ తప్పించుకునే సాధనం, మీ నాయనమ్మకి.”
“చచ్చిపోయిన మీ తాత తద్దినం, దాని తాలూకూ ఏర్పాట్లూ, పిలుపులూ గుర్తుంటాయే ... జ్వరం గా ఉన్న మనవడిని, బుజ్జగించి, ముద్ద తినిపించాలి అంటే పూజ అడ్డొచ్చిందా?! తన సౌకర్యానికి, ‘వైరాగ్యం’ అని  పేరు పెట్టింది మీ నాయనమ్మ. తప్పించుకు తిరగడం, వైరాగ్యమనే రంగు పూయటం. స్పందన లేక పోవటమా వైరాగ్యమంటే?”
“మీ నాన్న? ఏమి పట్టనట్టు, ఏ రోజూ తనకంటూ ఒక అభిప్రాయం, ఒక ఆశ ఉన్నట్టు కనపడలేదు. పిల్లికి బిచ్చం పెట్టడు సరే, మీ అమ్మకో, నీకో, కనీసం మనస్పూర్తిగా, ఒక మాట సాయం చెయ్యగలడా! తన ప్రేమని, అభిరుచిని, కనీసం, తన సమయాన్ని తన వాళ్ళకి పంచగలడా? అసలు 'తనదీ’ అని దేన్నైనా అనుకుంటాడా?”
“ఇక మీ అమ్మ అవస్థ చెప్పొద్దు. హృదయం ఉండి ఏవిటి ప్రయోజనం ...తను ఎంతో ఇష్టంగా, తృప్తిగా చేసే వంటనీ, చూసుకునే నిన్నూ, వదిలి ఇష్టం లేక పొయినా, ఉద్యోగానికి వెడుతోంది. ఏదో మీ అత్తయ్య అన్న మాటకి పౌరుషం తెచ్చుకుని, ఉద్యోగం తెచ్చుకుంది. డబ్బు సంపాయించే శక్తి, చదువు, తెలివి తనకుందని ఎవరికి, ఏవిటి, రుజువు చెసింది? తన మనుసుకి ఏం కావాలనేది, ఎవరో ఏం చెప్పగలరు !!?...”
“నీకు గుర్తు లేదూ, నువ్వు రోజూ 2 గులాబీలు కొని, అమ్మ జడలో ఒకటి పెట్టి, టీచర్ కి ఒకటి తీసుకెళ్ళే వాడివి. ఏది? అమ్మకి తీరిక ఏది? పొయ్యిలో పిల్లి లేవలేదన్న సామెతను నిజం చేసింది అమ్మ. వారం లో 3 రోజులు ఇదే వరస.”
“నాకు రోత పుట్టింది ...మొన్న, ఆగస్టు 15, ‘తెలుగు వీర లేవరా…’ పాట రేడియో లో విని, స్వేచ్ఛ కోసం పారిపొయ్యా. అదే కుక్క అయితే, విశ్వాసం పేరు తో  ఏం జరిగినా మిమ్మల్నే ప్రేమిస్తుంది. నేను అలా కాదురా పాపి. ఏడవాలి, నవ్వాలి, ఆశ పడాలి, ప్రయత్నించాలి, అనుకున్నది జరక్కపొతే నిరాశ పడాలి.... అసలు ఒక్క మాటలో చె ప్పాలి, అంటే నీలా ఉండాలి. నాకు నీలా ఉండాలి రా!!  నువ్వు మాత్రం ఇలానే ఉండు...పిల్లికి 9 జన్మలటగా ...నువ్వు పెద్దగా అయ్యేసరికి...నేను చచ్చి మళ్ళీ పుడతా... అప్పటికీ నువ్వు ఇలానే ఉండు. నేను నీతొనే ఉంటా. నువ్వురా, నా యజమాని! "                             
పాపి ఏడుస్తూనే, "ఒట్టూ!?" అన్నాడు, చెయ్యి కిటికీ  లోంచి చాచి. పిల్లి పాపిగాడి చెయ్యి నాకి, కిటికీ లోన్చి దూకేసింది. పాపికి, కితకితలు పుట్టి నవ్వేసాడు.
పాపిగాడు ఏదో కలవరిస్తిన్నట్టుగా అనిపిస్తే, వెళ్ళి చూద్దామని, లేచింది వసుంధర. వాడు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు స్పష్టంగా ఉంది గొంతు. గదిలోకి వెళ్ళి చూస్తే వాడు చిన్నగా నవ్వుతూ, నిద్ర పోతున్నడు...కిటికీ లోంచి చంద్రుడి వెలుగు పడ్డ పాపిగాడి మొహం చూస్తే, మామూలు గానే ముద్దుగా, అమాయకంగా, ఉండే వాడి మొహం, వసుంధరకి మనోహరంగా కనపడింది.
అంత నిద్ర లోనూ ఒక చిరునవ్వుతో త్రుప్తిగా వెళ్ళి పడుకుంది.

తెల్లారింది. పాపి గాడు ఆరింటికల్లా లేచి, బుద్ధిగా వేడి నీళ్ళు పెట్టించుకు మరీ స్నానం చేసి, రోజూ విసిరి కొట్టే ఇడ్డెన్లు, పేచి లేకుండా తిని, స్కూలుకి వెళ్ళాడు. వసుంధర అఫీసు మానుకుని, ఆ పూట వాడిని తనే స్కూలుకి తీసుకెళ్ళింది. సాయంత్రం వాడిని ఇంటికి ‌తెస్తూంటే, దారిలో, పాలు పోసే సిమ్హాచలం కనపడి, వాళ్ళ గేదె ఈనిందనీ, జున్ను పాలు ఇంటికెళ్తూ తీసుకెళ్ళమని చెప్పింది. పాపి గాడు చక చకా, స్కూలు బ్యాగ్, లంచ్ టిఫ్ఫిన్ వసుంధర చేతికిచ్చేసి దూడని చూడడానికి సిమ్హాచలం కూడా వెళ్ళాడు.

ఇంటికొచ్చి మొహంకాళ్ళు కడుక్కుని, తనే తల దువ్వుకున్నాడు. దీపం పెట్టే ‌వేళకి, హోం వర్క్ చేసుకుంటూ, మధ్యలో తల ఎత్తి “అమ్మా, నేను పెద్దవాడినై, నాకు పెళ్ళి అయ్యాక, నేను మారిపోతనా?”
“మారిపోవటం అంటే ఏ రకంగా రా పాపి?” అని వసుంధర అడిగే లోపే, “పిల్లి గోల తీరింది.. ఇక పెళ్ళి గోల మొదలా!” అని గట్టిగా నవ్వింది పాపిగాడి నాయనమ్మ.

---  'మెట్టా'