స్వప్నా,
ఎందుకో కలం ముందుకు సాగనంటోంది. గుండె ఈ క్షణాన తాను మూగనంటోంది. ఎలా వ్రాసేది నేను వణికే ఈ చేతితో? ఎలా పలికేది నేను గుండె గొంతుకలో కొట్టాడుతోంటే?
ఉలి తాకిడికే ఉలిక్కిపడి వళ్లంతా కళ్లు చేసుకు చూసిన శిల సుందరమైన శిల్పమైనట్లు - ఏ స్పందనా లేని వెదురు గాలిని తోడు చేసుకొని ప్రకృతినే కదిలించే వేణువైనట్లు - నీ పరిచయం ఏవేవో కొత్త ప్రపంచ ద్వారాల్ని నాలో తెరిచింది.
అప్పుడప్పుడు అసలిదంతా ఎలా ప్రారంభమైందీ అని ఆలోచిస్తే, రాత్రంతా మంచులో తడిసిన మల్లెమొగ్గ ఏ క్షణాన రేకులు విప్పుకు వళ్లు విరుచుకుంటుందో..... నీరెండల ఛాయలలో హరివిల్లే క్షణాన తొలకరిస్తుందో... - ఆ క్షణాల్ని ఎలా పట్టుకోగలమనిపిస్తుంది.
బహుశా నీకు గుర్తుండే వుంటుంది. మే నెలాఖరు రోజుల్లో ఎప్పట్లానే ఇంటి ముందు అరుగుల మీద సోమరిగా గోళ్లు గిల్లుకొంటూ కూర్చొని వచ్చి పోయే వాళ్లను చూస్తో నేను అదే తొలిసారి నిన్ను చూడటం!

చెదిరిన జుట్టూ నిద్ర భారం వదలని కళ్లూ నలిగిన తెల్లటి చుడీదార్‌, ఎర్ర కుర్తా, కాళ్లకు చెప్పులైనా లేకుండా రాధతో కలిసి పోతూ.. పోతూ ఓ చిన్ని చూపును నాపైకి విసిరి ఏమీ పట్టనట్లే వెళ్లి పోయావు.
కథ అంతటితో ఆగిపోతే ఎలా ఉండేదో!! ఆ సాయంత్రమే మీ అమ్మతో పాటు మా ఇంట్లో నువ్వు. మనం బంధువులమని తెలియటం నాకైతే మోస్ట్‌ థ్రిల్లింగ్‌ అన్పించింది. మీ ఇంటికి రమ్మని మీ అమ్మ ఆహ్వానిస్తుంటే స్నేహపూర్వకంగా ఓ చిర్నవ్వు బహుకరించావు నువ్వు.
గుండె మోయలేనంత భారమే అయ్యిందో... దూది పింజంత తేలికైపోయిందో చెప్పలేని, అసలేమీ అర్థం కాని వింత అనుభూతి. ఆ రాత్రే డైరీలో రాసుకొన్నానిలా-
'నీకేం
ఓ చూపు విసిరి, ఓ చిర్నవ్వు రువ్వి
కళ్లనలా అలవోకగా తిప్పేసుకు పోయావ్‌
ఆ చిన్ని చూపు ధ్వనికే
మనసు చెదిరీ, వయసు రగిలీ
కలత నిండిన ఎదతో నేనే కదా
నాలోంచే పారిపోయి నిన్ను చేరుకోవాలనుకొనేది'
- ఇక మీ ఇంటికి రాకపోకలు సాగించానా, ప్రతిసారీ నీతో ఏవేవో కబుర్లు చెప్పాలనీ, నా మనసులోని 'అసలు నిజమైన మాటల్ని' ఎలాగైనా సరే నీకు చెప్పేయాలని నిర్ణయించుకొని మీ ఇంటికి వస్తాను. మళ్లీ మామూలే. గుండె వేగం హద్దులు దాటి, పెదవులు ఎండి పోతాయి. అందుకే అసలు నిజాన్ని గుండెలోనే నొక్కిపట్టి అర్థం పర్థం లేని రాజకీయాలూ చదువుల గూర్చి ఏమిటేమిటో పిచ్చిగా వాగేసి బయట పడతాను. లోపలింత పైత్యం దాచుకొని పైకి మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద సీరియస్‌ లెక్చర్లిచ్చానని నవ్వుకొంటున్నావా!?
గాలిబ్‌ గుర్తుకొస్తున్నాడు నాకు .. -
'నా తోటి బంధమ్ము
త్రెంచబోకు
ప్రేమ లేకున్న
ఉండనీ ద్వేషమేని'
- సరే నువ్వు అవునన్నా కాదన్నా - నక్షత్రం చనిపోయినా దాని చివరి కాంతిరేఖ సైతం వందల సంవత్సరాల పాటు భూమిని వెతుక్కొంటూ పయనించినట్లు, నేనేమైపోయినా నా పిచ్చి ప్రేమ మాత్రం నీ సాన్నిధ్యంకై పరితపిస్తూ పరిభ్రమిస్తూనే ఉంటుంది.
ప్ర‌పంచానికిది కోటి కాంతుల స్వ‌ర్ణ దీపావ‌ళి
నువ్వు లేని నాకు మాత్రం గాఢాంధ‌కార అమావాస్య రేయి.
ఎప్పటికీ
నీ
నేను
ప్రేమ లేఖ ఆడియో:

ఆంధ్ర‌జ్యోతి వార‌ప‌త్రిక నిర్వ‌హించిన ప్రేమ‌లేఖ‌ల పోటీలో గెలుపొందిన ప్రేమ‌లేఖ ఇది. -- ఉద‌య కుమార్‌